గొలగమూడి

శ్రీ వెంకయ్య స్వామి

గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి


శ్రీ వెంకయ్యస్వామి




గొలగమూడి ఒక కుగ్రామం.నెల్లూరుకు సుమారు 10 కి.మీ ల దూరంలో ఉంది. హైదరాబాదులో చిల్కూరుకు ఎంత ప్రాచుర్యం ఉందో నెల్లూరులో గొలగమూడికీ అంతే ప్రాచుర్యముంది. నెల్లూరు నుంచి మంచి రవాణా సదుపాయముంది. వెంకయ్యస్వామి 12 సంవత్సరములు ఎక్కడ తిరిగాడో తెలియదు. గొలగమూడి చేరాడు. వేలిముద్రలు వేసిన కాగితాలు ఇచ్చాడు. దారాలు ఇచ్చాడు. ఆ తరువాత వాక్కు చెప్పాడు. సత్యంగల నాయన అని పేరు పొందారు. తన వద్దకు వచ్చిన, భక్తుల నుద్దేశించి, వారికోసం తన సందేశాలను, తన సేవకులచేత కాగితంపై రాయించి, వారికి అందచేసేవారు, స్వహస్తాలతో. వీటిని సృష్టి చీటీలనేవారు. భక్తులు వీరిని షిర్డి సాయి అవతారముగా భావిస్తారు. ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు వీరిని అవధూతగా కొలుస్తారు. మరికొందరు వెంకయ్య స్వామిని దత్తావతారమని తలుస్తారు. పలువురు వారి కష్టాలను వెంకయ్య స్వామే తీరుస్తాడనే నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. చిల్కూరులో బాలాజీ చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసినట్లుగా, ఇక్కడా అవధూత దెవాలయం చుట్టూ 108 సార్లు భక్తుల ప్రదక్షిణలున్నాయి. ఈ దేవాలయ అభివృద్ధికి హీరో చిరంజీవి విరాళం తోడ్పడిందని చెప్తారిక్కడివారు. దేవాలయ ప్రాంగణం అనేక వ్యాపార దుకాణాలతో నిండి ఉంది. షిర్డి గ్రామం సాయినాధుడు లేకుండా మనజాలదు. గొలగమూడి గుడి కూడా అట్లే, ఎటుచూసినా అన్ని దుకాణాలు, వెంకయ్య పేరుపైనే ఉంటాయి. వ్యాపారం, ఆధ్యాత్మికత రెండూ పెనవేసుకుపోయాయీ ఊళ్ళో.
సశరీరంతో ఉండి ఎన్ని పనులు చెయ్యగలరో అశరీరంతో కూడా అన్నే పనులు చెయ్యగల మహిమాన్వితులను అవధూతలంటారు. వారు భక్తుల కొంగుబంగారమై నిరంతరమూ వారికి రక్షగా ఉంటారు. ఎన్ని సమస్యలు, రుగ్మతలున్నప్పటికీ, అవధూత సాన్నిహిత్యంలో భక్తులు ఎంతో మానసిక ప్రశాంతత పొందుతారు. వారికి ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ప్రశాంతికి ఈ స్వామిపై గురి మెండు. గుడిలోకి వెళుతూనే అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణం గావించాము. ఇక్కడ అహర్నిశమూ అగ్ని వెలుగుతూనే ఉంటుంది. తదుపరి దేవాలయము చుట్టూ ఒక ప్రదక్షిణ గావించి వెంకయ్యస్వామి దర్శనం చేసుకున్నాం. గుడి లోపల చాలామంది స్త్రీలు పుష్పాలను మాలలు కడుతున్నారు. భక్తులెవరైనా లోపలకు వెళ్ళి మాలలు కట్టవచ్చని ప్రశాంతి చెప్పారు. తను దేవుని చుట్టూ ప్రదక్షిణలు గావించవలసి ఉన్నందున, నన్ను ఆ పూలవాటిక దగ్గర నిరీక్షించమని చెప్పారు. నిరీక్షిస్తూ చుట్టూ పరికించి చూశాను. దేవాలయ కుడ్యాలపై రాసిన వెంకయ్యస్వామి చెప్పిన సూక్తులు నన్నాకర్షించాయి.
మీరూ చదవండి.
1) ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా.
2) వాళ్ళుండే దాన్నిబట్టి గదయ్యా మనముండేది.
3) అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకో.
4) అందరికీ పంట పండించాను. దాన్ని దొంగలుపడి దోచుకోకుండా చూసుకోండయ్యా.
5) ఒకరిని పొమ్మనేదాన్ని కంటే మనమే పోవటం మంచిదయ్యా.
6) సన్యాసులుగా ధర్మంగా ఉండటంలో గొప్పేముందయ్యా. సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప.
7) వెయ్యి గొర్రెలలో ఉన్నా, మన గొర్రెను కాలు పట్టి లాక్కు రావచ్చు.
8) మంత్ర మెక్కడుంది? తంత్రమెక్కడుంది? చూచుకొంటూ పొయ్యేది గదయ్యా.
9) సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడ కొచ్చి ఏదనుకొంటే అదయ్యేదే గదయ్యా.
10) నీవు నన్ను విడిచినా, నేను నిన్ను విడువను.
11) మహారాజుని చూస్తే ఏమొస్తుంది? నీ కేముందో అదే నీకు మిగులు కదయ్యా.
12) అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు, నీవు దేవుడిని చూడగలవు కదయ్యా.
13) నా ఎడల నీ విశ్వాసమే నన్ను కదిలిస్తుంది కదయ్యా.
14) కూలివానికి, అతని చెమటారకముందే, కూలి ఇవ్వటం మంచిది కదయ్యా.
15) ఇతరులకు డబ్బు వడ్డీకి ఇచ్చే సమయంలో కూడా ధర్మాన్ని వీడరాదయ్యా.
16) పావలా దొంగిలిస్తే, పదిరూకల నష్టం వస్తుంది గదయ్యా.
17) లాభం కోసం కక్కుర్తి పడితే, ఆ పాపంలో భాగం పంచుకోవాలి గదయ్యా.
18) దారం తెగకుండా చూసుకో. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను గదయ్యా.
19) అత్యాశ వదులుకుంటే, అన్నీ వదులుకున్నట్లే.
20) మర్యాదలు పాటిస్తూ, సాధారణ జీవితం గడుపుతూ, సద్గురులకు సేవ చెయ్యటం నేర్చుకోవటం మంచిది గదయ్యా.
 

శ్రీ వెంకయ్యస్వామి

శ్రీ వెంకయ్యస్వామి
గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి